ఐపీఎల్ లో మొదటిసారి..!
ఐపీఎల్ లో రాజస్తాన్, పంజాబ్ మ్యాచ్‌లో బట్లర్ ఔట్ కొత్త వివాదాన్ని రేపింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌లో 13వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. బట్లర్‌ను అశ్విన్ ‘మన్కడింగ్’ద్వారా ఔట్ చేయడమే దీనికి కారణం. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ XI పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బట్లర్ రనౌట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఔట్ పై మిశ్రమoగా స్పందిస్తున్నారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరు, ఐసీసీ నియమాల ప్రకారమే అని కొందరు వాదిస్తున్నారు.
ఏం జరిగిందంటే ?
13వ ఓవర్ ఐదో బాల్ వేసేందుకు అశ్విన్ సిద్ధమవుతున్నాడు, చేతిలోంచి బంతి ఇంకా వదలక ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బట్లర్ ముందుకు కదిలాడు. అశ్విన్ అతడిని గమనించి మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది.
నిబంధనల (రూల్ 41.16) ప్రకారమైతే థర్డ్ అంపైర్ చేసింది సరైందే. కానీ సుదీర్ఘ కెరీర్లో ‘జెంటిల్మన్’గా గుర్తింపు ఉన్న అశ్విన్… ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపించింది. బట్లర్ క్రీజ్ దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమై అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించేలా చేసింది.
“మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగ్రత్తతతో ఉండటం అవసరం” అని అశ్విన్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.
మన్కడింగ్ అంటే ఏంటి..?
నాన్ స్ట్రైకర్ స్థానంలో ఉన్న బ్యాట్స్‌మెన్, బౌలర్ బంతి వేయకముందే క్రీజు దాటితే… అప్పుడు బౌలర్ బంతిని వేయకుండా, నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను గిరాటేయొచ్చు. సాంకేతికంగా దీనిని ఔట్‌గా పరిగణిస్తారు. కానీ ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురి క్రికెట్ అభిమానులు, పండితుల వాదన.
“మన్కడింగ్” అనే పేరు ఎలా వచ్చిందంటే ?
1950లో ఆస్ట్రేలియా పర్యటనలో వినూ మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు మన్కడ్ అతన్ని వారించినా వినిపించుకోలేదు. దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ అతన్ని రనౌట్ చేయడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ పర్యటనలో మరోసారి కూడా మన్కడ్ ..బ్రౌన్‌ను ఔట్ చేశాడు. అప్పటినుంచి ఈ రనౌట్‌ను మన్కడింగ్ అంటున్నారు. బంతిని విసరకముందే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోని బ్యాట్స్‌మన్‌ను భారత దిగ్గజం వినూ మన్కడ్ చేయడంతో ఆ రనౌట్‌ను మన్కడింగ్ అనే పేరుతో పిలుస్తున్నారు.
క్రికెట్లో మన్కడింగ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పూర్తిగా ఆ పదాన్నే తొలిగించాలన్నాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన రనౌట్‌గా పరిగణించే ఈ ప్రక్రియకు భారత క్రికెట్ దిగ్గజం పేరును కొనసాగించడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎం.సీ.సీ (మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్) ఈ పేరును వాడకుండా నిబంధనలు మార్చాలని గవాస్కర్ డిమాండ్ చేశాడు. అంతగా అవసరమైతే తొలిసారిగా ఇలా ఔటైన బిల్ బౌన్ పేరు మీదుగా బౌన్డ్ అని పిలువాలంటూ సూచించాడు.